‘ఉచితాలతో దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది’

సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు

‘ఉచితాలతో దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది’

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తమిళనాడు విద్యుత్‌ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్‌ ధర్మాసనం తీవ్రస్థాయిలో స్పందించింది. తమిళనాడులో ఉచిత విద్యుత్‌ సరఫరా, ఆర్థిక స్థితిగతులపై విచారణ చేపట్టిన కోర్టు, విద్యుత్‌ పంపిణీ సంస్థకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో వివరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది. ‘‘పేదలకు విద్య, కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అంగీకరించిన ధర్మాసనం.. పెద్ద పెద్ద భూస్వాములకూ ఫ్రీ విద్యుత్‌ అందించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, ఎన్నికలకు ముందే ఉచిత పథకాలను ప్రకటించే సంస్కృతిపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు తమ సిద్ధాంతాలను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వెనుక ప్రజల కష్టార్జితం ఉందని.. రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. సంక్షేమం పేరుతో ఆర్థిక క్రమశిక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించింది.

2

Tags: