T20 WC-2028: అర్హత సాధించిన బంగ్లాదేశ్‌ జట్టు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) కీలక ప్రకటన

T20 WC-2028: అర్హత సాధించిన బంగ్లాదేశ్‌ జట్టు

స్పోర్ట్స్​‍ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2026) నుంచి అనూహ్యంగా వైదొలిగిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు ఓ శుభవార్త. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి సంబంధించి గురువారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) కీలక ప్రకటన చేసింది. భారత్‌-శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచ కప్‌ 2026 ఫిబ్రవరి 7న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు సూపర్‌-8కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌(Team India), పాకిస్థాన్‌, గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే జట్లు సూపర్‌-8కి క్వాలిఫై అయ్యాయి. అలానే గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్‌, గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8కి అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే అనూహ్య రీతిలో సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో సూపర్‌-8కి అర్హత సాధించిన జట్లు 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కి నేరుగా అర్హత సాధించాయి. అలానే ఆతిథ్య దేశాలుగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సైతం టోర్నీకి అర్హత సాధించాయి. వీటితో పాటు బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ జట్లు కూడా ఐసిసి ర్యాంకింగ్స్​‍ ఆధారంగా టీ20 ప్రపంచకప్‌ 2028 టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్​‍ బంగ్లాదేశ్‌ 9వ స్థానంలో ఉంది. ఆఫ్గానిస్థాన్‌ 10వ స్థానంలో, ఐర్లాండ్‌ 12వ స్థానంలో ఉన్నాయి. 2028 టోర్నమెంట్‌ కోసం మిగిలిన ఎనిమిది స్థానాలను క్వాలిఫైయింగ్‌ మ్యాచుల ద్వారా నిర్ణయిస్తారు.

4

Tags: