తొర్రూర్‌లో అంబరాన్నంటిన సంబరాలు

భారీ ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవ సంబురాలు

ప్రజాపాలనే గెలిచింది: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌  ఝాన్సీ రాజేందర్‌రెడ్డి

5
ఫొటో: తొర్రూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ దృశ్యం

తొర్రూరు, (నేటి ఫోకస్న్యూస్ ప్రతినిధి)-ఫిబ్రవరి 18: మున్సిపల్‌ ఎన్నికల్లో ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ పదవులను కైవసం చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు తొర్రూరులో ఘనంగా సంబరాలు  జరుపుకున్నారు. కాంగ్రెస్, సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జరిగిన విజయోత్సవ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా  ‘జై యశస్విని రెడ్డి, జై  ఝాన్సీరెడ్డి..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టడంతో పట్టణమంతా  మార్మోగింది. నూతన కౌన్సిలర్లతో నిర్వహించిన ఈ భారీ విజయోత్సవ ర్యాలీలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాపక్షమే గెలిచిందని.. పాలకుర్తి ప్రజలు తెలివైన వారని మరోసారి నిరూపించారని అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం గెలుపుగా మారిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలను అభినందించి, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన చైర్మన్‌, వైస్ చైర్మన్‌లను కౌన్సిలర్లు  గజమాలతో సత్కరించారు. మొత్తం మీద ఈ విజయోత్సవ కార్యక్రమం తొర్రూర్‌ పట్టణంలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసి, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Tags: